ఎఫ్ఆర్‌డీఐతో డిపాజిట్లు స్మాషే!?

0
55

దోపిడీదారుల‌కు అనుకూలంగా కేంద్రం కొత్త చ‌ట్టం
బ్యాంకుల్లోని సొమ్ముకు భ‌ద్ర‌త క‌రువు
ఖాతాదారుల‌కు పంగ‌నామాలు పెట్టేందుకు మోడీ స‌ర్కార్ వ్యూహం

పెద్ద నోట్ల ర‌ద్దు.. జీఎస్టీతో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కకావిక‌లం చేసిన ప్ర‌ధాని మోడీ మ‌రో గుదిబండ‌ను ప్ర‌జ‌ల‌పై మోదేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అదే ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు. మోడీ ప్ర‌తి చ‌ర్య‌నూ అడ్డంగా స‌మ‌ర్థించే జాతీయ మీడియాలోని ఒక వ‌ర్గం ఈ బిల్లుతో ఎంతో ప్ర‌యోజ‌న‌ముందంటూ చెప్పే ప్ర‌య‌త్నం చేస్తోంది. అస‌లు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో ర‌క్ష‌ణే లేన‌ట్టు.. కొత్త‌గా మోడీ తెచ్చే బిల్లుతోనే అది స‌మ‌కూరుతున్న‌ట్టు క‌ల‌ర్ ఇస్తున్నాయి. కానీ ఆ ప్ర‌చారం వాస్త‌వ విరుద్ధం. సోష‌ల్ మీడియాలో ఎఫ్ఆర్‌డీఐ బిల్లుపై సాగుతోన్న ప్ర‌చారంలో కొన్ని వాస్త‌వాలు.. మ‌రికొన్ని వ‌క్రీక‌ర‌ణ‌లు ఉన్నాయి. స్థూలంగా చూస్తే మాత్రం స‌గ‌టు భార‌తీయుడి జేబుకు చిల్లులు పెట్టేందుకు కేంద్రం క‌త్తులు నూరుతోంద‌ని అర్థ‌మ‌వుతున్న‌ది.

ప్ర‌జ‌ల‌కు అర్థంకాని కౌటిల్యుడి భాష‌లో ఆర్థిక వేత్త‌లు ఎఫ్ఆర్‌డీఐ బిల్లుకు త‌మ‌దైన భాష్యం చెప్తున్నారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌సారం అవుతోన్న పోస్టింగ్‌ల‌ను మొత్తానికి మొత్తం త‌ప్పుబ‌డుతూనే ఆ బిల్లుతో ఏదో ఒరిగిపోతుంద‌నే భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొత్తం చ‌దివితేగానీ వారు చెప్ప‌దల‌చింది ఏమిటో బోధ ప‌డ‌దు. ఎటు నుంచి ఎటు తిప్పి చెప్పినా చివ‌రికి ప్ర‌జ‌లు బ్యాంకుల్లో దాచుకున్న మొత్తంలో ఒక్క ల‌క్ష రూపాయ‌ల‌కు మాత్రం ఈ బిల్లు భ‌రోసా ఇస్తుంది. మిగ‌తా సొమ్ము కృష్ణార్ప‌ణ‌మే. అదే సమ‌యంలో రుణ ఎగ‌వేత‌దారుల‌కు స్వ‌ర్గ‌ధామంలా మార‌బోతోంది ఈ బిల్లు. ఇవే విష‌యాలు అపోహ‌లుగా సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. వాటిని ఇప్పుడు స‌ద‌రు ఆర్థిక‌వేత్త‌లే ఏదో ఒక‌ర‌కంగా ఒప్పుకుని తీరుతున్నారు.

బ్యాంక్ డిపాజిట‌ర్ల‌కు బీమా ముసుగులో వ‌స్తోన్న ఈ బిల్లు మొత్తానికి మొత్తం సామాన్య ఖాతాదారుల సొమ్మును ఊడ్చివేయ‌డానికే అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఏదేని ఖాతాదారుడు త‌న బ్యాంకు ఖాతాలో దాచుకున్న సొమ్మును ఆయా బ్యాంకులు వివిధ రూపాల్లో పెట్టుబ‌డులు పెడుతుంటాయి. సంస్థ‌ల‌కో, వ్య‌క్తుల‌కో రుణాలుగానూ ఇస్తుంటాయి. ఇక్క‌డ రుణం పొంది న‌ష్టాల పేరుతో ద‌ర్జాగా త‌ప్పించుకునేందుకు కొత్త బిల్లు ఎర్ర‌తివాచీ ప‌రుస్తుండ‌గా ఆరుగాలం కష్టాన్ని బ్యాంకుల్లో దాచుకున్న సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తికి మాత్రం ముష్టి ల‌క్ష రూపాయ‌లు విదిల్చి చేతులు దులుపుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది కేంద్రం. ఇందుకు ఆర్‌బీఐ భుజాల‌పై తుపాకీ ఉంచి ప్ర‌జ‌ల‌పైకి గురిపెడుతోంది. త‌మ ర‌హ‌స్య స్నేహితుల‌కు ప్ర‌జ‌ల సొమ్మును దోచిపెట్టేందుకే ఎఫ్ఆర్‌డీఐ బిల్లును తీసుకువ‌స్తున్న‌ది.

ఏదేనీ బ్యాంకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన‌ప్పుడు ఈ బిల్లు ర‌క్ష‌ణ క‌వ‌చంలా నిలుస్తుంద‌ని మోడీ అనుకూల ఆర్థిక‌వేత్త‌లు నిర్వ‌చిస్తున్నారు. జీ-20 దేశాలు చేసుకున్న ఒడంబ‌డిక మేర‌కు 2009లో ఫైనాన్షియ‌ల్ స్టెబిలిటీ బోర్డుని ఏర్పాటు చేశాయి, ఆర్థిక సంస్థలు వైఫల్యం చెందే సందర్భాల్లో, తగిన ముందస్తు చర్యలు చేపట్టేందుకు వీలుగా ఈ బోర్డు కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల ఆధారంగా ప్రతిపాదించిన‌దే ఈ ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు.

ఏదేని ఆర్థిక సంస్థ లేదా బ్యాంకు నిర్వ‌ర్తించే రోజువారీ విధుల్లో ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ద్వారా ఏర్పాటు చేయబోయే రిజల్యూషన్‌ కార్పొరేషన్ జోక్యం చేసుకోబోదు. ఏవైనా కార‌ణాల‌తో ఆ సంస్థ లేదా బ్యాంకు నిర్వ‌హ‌ణ‌లో చేతులెత్తేసిన‌పుడు మాత్రమే క‌లుగ‌జేసుకుని ఆయా సంస్థ లేదా బ్యాంకులో సొమ్మును దాచుకున్న, ఫిక్స్‌డ్, రిక‌రింగ్ డిపాజిట్ చేసిన‌ ఖాతాదారులకు కాసింత ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. అంటే మ‌నం స‌ద‌రు సంస్థ‌/బ‌్యాంకును న‌మ్మి ఓ ప‌ది లక్ష‌ల‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకు చేతులెత్తేసిన‌పుడు మ‌న‌కు కేవ‌లం ల‌క్ష రూపాయ‌లు మాత్ర‌మే తిరిగి వ‌స్తాయి. అదే స‌మ‌యంలో మ‌న సొమ్మును అప్పుగా తీసుకున్న వ్య‌క్తి వ్యాపారంలో న‌ష్టాలు వ‌చ్చిన‌ట్టు చూపించుకుంటే అత‌డికి రుణ చెల్లింపు నుంచి విముక్తి దొరుకుతుంది. ఈ బిల్లు రాక పూర్వ‌మే విజ‌య్‌మాల్యా తొమ్మిది వేల కోట్ల‌కు పైగా అప్పులు చేసి విమానం ఎక్కి విదేశాల‌కు చెక్కేశాడు. ఈ బిల్లు చ‌ట్ట రూపం దాలిస్తే మాల్యా లాంటి వాల్లు డెఫ్‌షీట్ చూపిస్తే చాలు అప్పు క‌ట్ట‌కుండా ఇక్క‌డే స్వేచ్ఛ విహారం చేయ‌వ‌చ్చు.

ఇదంత‌టికీ కార‌ణం ముసాయిదా బిల్లులో ప్ర‌తిపాదించిన బెయిల్‌-ఇన్ నిబంధ‌న‌. ఈ నిబంధ‌న‌తోనూ ఖాతాదారుల‌కే ల‌బ్ధి చేకూరుతుంద‌ని చెప్పేందుకు మోడీ భ‌క్తులు ఆప‌సోపాలు ప‌డుతున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు పొంది న‌ష్ట‌పోయిన వారికి స‌హ‌కారం అందించ‌డానికి అనేక చ‌ర్య‌లు చేప‌డ‌తారు అనే నిబంధ‌న‌కు అర్థం ఏమిటో స‌ద‌రు ఆర్థికవేత్త‌లు సెల‌వివ్వ‌రు. కేవ‌లం ఎగ‌వేత‌నూ ప్రోత్స‌హించ‌దు అని మాత్ర‌మే చెప్తుంటారు. ఎగ‌వేత‌ను ప్రోత్స‌హించ‌న‌పుడు ఈ నిబంధ‌న ఎందుకంటే రుణ గ్ర‌హీత‌లు చితికిపోతే సాయం చేయొద్దా అంటూ ఎదురు ప్ర‌శ్నిస్తారు. రుణ గ్ర‌హీత‌ల ర‌క్ష‌ణ విష‌యంలో ఇన్నేసి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న కేంద్రం డిపాజిట‌ర్ల ర‌క్ష‌ణ‌ను కేవ‌లం ల‌క్ష రూపాయ‌ల‌కు ఎందుకు ప‌రిమితం చేసిన‌ట్టు. మీరు అంత‌కన్నా ఎక్కువ మొత్తం బ్యాంకుల్లో దాచుకుంటే మాది పూచీకాదు అని చెప్పిన‌ట్టే క‌దా? ఈ ముసాయిదా బిల్లు ప్ర‌స్తుత పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లోనే పార్ల‌మెంట్ ముందుకు తెచ్చేందుకు మోడీ స‌ర్కార్ ప్ర‌య‌త్నిస్తోంది. ఇది చ‌ట్ట రూపం దాల్చేముందు 1.20 కోట్ల‌కుపైగా భార‌తీయుల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిగ‌ణలోకి తీసుకోవ‌డం క్షేమ‌క‌రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here