జిల్లాల కుదింపా? అంతా తూచ్‌!

0
160

ఎవ‌రి దృష్టి మ‌ర‌ల్చ‌డానికి ఈ ఎత్తుగ‌డ‌?
అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్ కోస‌మే లీకులు?
కీల‌క వ్య‌క్తి ఇచ్చిన స‌మాచార‌మే ప్ర‌చారంలోకి..!

తెలంగాణ ప్ర‌భుత్వ వ‌ర్గాలు రెండు రోజుల క్రితం కీల‌క‌మైన లీకును బ‌య‌ట‌కు వ‌దిలాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా చెప్పుకునే వ్య‌క్తి నుంచి ఈ లీకులు వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారంలో ఉంది. గ‌తేడాది ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో కాసింత కోత విధించ‌వచ్చ‌న్న‌ది స‌ద‌రు లీకు. ఇచ్చింది కీల‌క‌మైన వ్య‌క్తి కాబ‌ట్టి దానికి ప్రాధాన్యం లేక‌పోలేదు. ఒక ప్ర‌ధాన దిన‌ప‌త్రిక‌లో ప్ర‌ధానంగా ఈ వార్త ప్ర‌చురిత‌మైంది. కొత్త జిల్లాల్లో కొన్నింటిని ర‌ద్దు చేసే యోచ‌న‌లో ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌ట్టుగా ఈ క‌థ‌నంలో పేర్కొన్నారు. రాజ‌కీయ ఒత్తిడితో చివ‌రిక్ష‌ణంలో ఏర్పాటు చేసిన కొన్ని జిల్లాల‌కు మంగ‌ళం పాడాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లుగా మీడియాలో వార్త‌లు చెక్క‌ర్లు కొట్టాయి. ఇక సోష‌ల్ మీడియా స‌రేస‌రే.

తెలంగాణ ప్ర‌భుత్వం 2016 ద‌స‌రా రోజున కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసింది. అప్ప‌టికే ఉనికిలో ఉన్న ప‌ది జిల్లాల‌ను 31 జిల్లాలుగా విభ‌జించింది. గ‌రిష్టంగా వ‌రంగ‌ల్‌ను ఐదు జిల్లాలుగా క‌నిష్టంగా ఖ‌మ్మం, నిజామాబాద్‌ల‌ను రెండేసి జిల్లాలుగా విడ‌దీసింది. క‌రీంన‌గ‌ర్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, ఆదిలాబాద్‌ పూర్వ జిల్లాల్లో నాలుగేసి, న‌ల్ల‌గొండ‌, రంగారెడ్డి, మెద‌క్‌ జిల్లాల్లో మూడేసి కొత్త జిల్లాలు ఆవిర్భ‌వించాయి. హైద‌రాబాద్‌కు ఉన్న చారిత్ర‌కత‌ నేప‌థ్యంలో య‌థావిధిగా ఉంచేశారు. అదే స‌మ‌యంలో మ‌రో చారిత్ర‌క న‌గ‌రం వ‌రంగ‌ల్‌ను అడ్డంగా విభ‌జించి వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల ఏర్పాటుకు సీఎంవో స్థాయిలోనే ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేశారు. దీనికి ప్ర‌జావ్య‌తిరేక‌త ఎదురుకావ‌డంతో ఎవ‌రూ కోరుకోని వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లా ప‌రిధిలో ప‌ర‌కాల‌, న‌ర్సంపేట‌, వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గాల్లోని మండ‌లాల‌ను చేర్చారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ఏర్పాటు చేయాల‌ని అక్క‌డి ప్ర‌జ‌లెవ్వ‌రూ కోరుకోలేదు. కానీ కొత్త క‌లెక్ట‌రేట్ త‌మకు స‌మీపంలో కావాలంటే త‌మ‌కు స‌మీపంలో కావాల‌ని మూడు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు ఉద్య‌మిస్తున్నారు. ఇందుకు నూటికి నూరుపాళ్లు సీఎంవోనే బాధ్య‌త వ‌హించాలి. ఇప్పుడు ఆ జిల్లాను ర‌ద్దు చేయాల‌ని యోచిస్తున్నార‌ట‌… అస‌లు వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ఏర్పాటు చేయ‌మ‌ని అడిగింది ఎవ‌రు? ఇప్పుడు ఎందుకు ర‌ద్దు చేయాల‌ని అనుకుంటున్నారు?

రాజ‌కీయ ఒత్తిడుల‌తో ఏర్పాటు చేసిన జిల్లాల్లో మొద‌టిది సిరిసిల్ల‌. అక్క‌డి ప్ర‌జ‌లు కాకుండా కేవ‌లం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన స్పాన్స‌ర్డ్ ఉద్య‌మానికి త‌లొగ్గి అక్క‌డ జిల్లాను ఏర్పాటు చేశారు. కేవ‌లం రెండంటే రెండే నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప‌రిమిత‌మైన జిల్లా ఇది. అలాంటిదే మ‌రో జిల్లా జ‌న‌గామ‌. ఇక్క‌డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సాగించిన పోరాటం కంటే మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల ల‌క్ష్మ‌య్య సాగించిన ఉద్య‌మంతోనే ఈ జిల్లా ఏర్పాటు అయ్యింది. ఇప్పుడు దానిని ర‌ద్దు చేయాల‌నే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంద‌ట‌. అలాంటిదే మ‌రో జిల్లా జోగులాంబ గ‌ద్వాల‌. మాజీ మంత్రి డీకే అరుణ ప‌ట్టుబ‌ట్టి సాధించ‌కున్న జిల్లా ఇది. పూర్వ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ‌లం ఎక్కువ‌. అందుకే ర‌ద్దు జాబితాలో గ‌ద్వాల పేరు చేర్చి కొరివితో త‌ల‌గోక్కునే ప్ర‌య‌త్నం ప్ర‌భుత్వం చేయ‌లేదు. నిర్మ‌ల్‌కు చారిత్ర‌క నేప‌థ్యం ఉంది. ఇక మేడ్చ‌ల్ విష‌యానికి వ‌స్తే మ‌ల్కాజ్‌గిరి జిల్లా కోసం కొద్దిపాటి ప్ర‌జా ఉద్య‌మాలు జ‌రిగాయి. జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌రణ ముసాయిదాలో ప్ర‌తిపాదించిన 27 జిల్లాల్లో మల్కాజ్‌గిరి పేరు కూడా ఉంది. మెజార్టీ ప్ర‌జ‌లు మ‌ల్కాజిగిరి స్థానే మేడ్చ‌ల్ పేరిట జిల్లా ఏర్పాటు చేయాల‌ని కోర‌డం దాని పేరు మారింది అంతే. ఇక ర‌ద్ద‌య్యే జాబితాలో చోటు ద‌క్కించుకున్న మ‌రో జిల్లా పెద్ద‌ప‌ల్లి. ఈ జిల్లాను ఏర్పాటు చేసిందే వివేక్ సోద‌రుల‌కు ప్రాధాన్యం క‌ల్పించ‌డం కోసం. ప్ర‌భుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వారు ఇప్పుడు స‌న్నిహితులు. వారి మ‌న‌సులు నొప్పించి ఆ జిల్లాను ర‌ద్దు చేయడం దాదాపు అసాధ్యం.

ర‌ద్ద‌య్యే జిల్లాలుగా ప్ర‌చారంలో ఉన్న‌వాటిలో ఒక్క వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో మిన‌హా మిగ‌తా అన్ని చోట్ల ఇంటిగ్రేటెడ్ క‌లెక్ట‌రేట్ల నిర్మాణాల‌కు దాదాపు స్థ‌ల సేక‌ర‌ణ పూర్త‌య్యింది. రెవెన్యూ అధికారులు స్థ‌లాన్ని స్వాధీన ప‌రిస్తే టెండ‌ర్లు పిలిచి ప‌నులు ఆరంభించ‌డానికి రోడ్లు భ‌వ‌నాల శాఖ సిద్ధంగా ఉంది. ఈ ద‌శ‌లో ఆ జిల్లాల ర‌ద్దు ప్ర‌తిపాద‌న అంతా ఉత్త‌దే. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా కేంద్రం పంచాయితీ తెంప‌డం ముఖ్య‌మంత్రికి అంత పెద్ద విష‌యమేమీ కాదు. కానీ ఎంత కాలం న‌డుస్తుందో న‌డ‌వ‌ని అని ప్ర‌గ‌తి వ‌ర్గాలు వేచి చూస్తున్నాయి. ఏదో ఒక రోజు సీఎం ఈ జిల్లా కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశామ‌ని ప్ర‌క‌టిస్తారు. ఒక‌టి రెండు రోజుల లొల్లి త‌ర్వాత అన్నీ చ‌ప్పున చ‌ల్లారి పోవ‌డం ఖాయం. జిల్లాల కుదింపుపై కొత్త జిల్లాలు ఏర్ప‌డిన నాటి నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అవ‌న్నీ టీఆర్ఎస్ వ్య‌తిరేకులు
చేస్తూ వ‌చ్చిన‌వే. ఇప్పుడు జ‌రుగుతున్న ప్ర‌చారం మాత్రం నూటికి నూరుపాళ్లు ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచే మొద‌ల‌య్యింది. ఇందుకు కార‌ణాలేమిటీ అని విశ్లేషించుకునే ప‌నిలో బుద్ధిజీవులు నిమ‌గ్న‌మ‌య్యారు. వారు ఆలోచిస్తున్న‌ట్టుగానే రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, రెవెన్యూ మంత్రి మ‌హ‌మూద్ అలీ జిల్లాల కుదింపు అంతా ఉత్త‌దే అంటూ కొట్టిపారేశారు. ప్ర‌భుత్వం వ‌ద్ద అలాంటి అంశ‌మేది ప‌రిశీల‌న‌లో లేద‌ని కుండబ‌ద్ద‌లు కొట్టారు.

అస‌లేం జ‌రిగింది?
ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి కీల‌క వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించే ఒకరు జిల్లాల కుదింపు విష‌యాన్ని కొంద‌రి చేవుల్లో ఊదారు. దాన్ని ఎలా? ఎవ‌రికి చేర‌వేయాలో చెప్పారు… వాళ్ల ల‌క్ష్యం నెర‌వేరింది. విష‌యం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లాలో అక్క‌డి వ‌ర‌కూ వెళ్లింది. ఒక ప్ర‌ధాన ప‌త్రిక‌లో ప్ర‌ధాన వార్తగా అచ్చ‌య్యింది. అంతే ఏదో తెలియ‌ని ఆందోళ‌న‌.. అల‌జ‌డి మొద‌ల‌య్యాయి. నిజంగానే జిల్లాల‌ను ర‌ద్దు చేస్తారా? మొత్తానికి మొత్తం జిల్లాల‌ను కుదిస్తారా? అదే జ‌రిగితే త‌మ ప‌రిస్థితి ఏమిటంటూ ఆరా తియ్య‌డం మొద‌లు పెట్టారు. సెక్ర‌టేరియ‌ట్‌లో త‌మ‌కు తెలిసిన వారిని వాక‌బు చేశారు. ఆయ‌నా స్ప‌ష్ట‌త రాలేదు. కొత్త జిల్లా కేంద్రం అంటే భూమికి డిమాండ్ వ‌స్తుంద‌ని ఉన్న ఊళ్లోది తెగ‌న‌మ్మి ఇక్క‌డి భూములు కొంటిమి ఇప్పుడెట్లా అని కొంద‌రు మ‌ద‌న‌ప‌డ‌టం మొద‌లెట్టేశారు. ఇలా ఆందోళన ప‌డ్డ‌వారిలో సింహ‌భాగం రైతు కుటుంబాల వారు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే.. అదే స‌మ‌యంలో టీఆర్ఎస్ కీల‌క నేత‌లుగా ఉన్న‌వారికీ టెన్ష‌న్ ప‌ట్టుకుంది. రియ‌ల్ట‌ర్లుగా తాము వెంచ‌ర్లు వేసి బ్లాక్ చేసిన భూముల‌ను ఇంకెవ‌రు కొంటారు అనే ఆందోళ‌న వారిది. నిరుద్యోగుల్లో మ‌రో ర‌క‌మైన టెన్ష‌న్‌. ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో? ఎక్క‌డి నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వ‌స్తుందో నిశితంగా గ‌మనిస్తోంది ప్ర‌గ‌తి భ‌వ‌న్‌. అన్నీ చూసి కొంద‌రు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నారు కూడా.

ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోస‌మే కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేశామంటూ ముఖ్య‌మంత్రి ప‌లు సంద‌ర్భాల్లో కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. జిల్లాల ఏర్పాటు అనేది రాష్ట్ర ప‌రిధిలోని అంశ‌మ‌ని, ఇందులో ఎవ‌రూ జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్రానికి నొక్కి చెప్పారు కూడా. అలాంటి కేసీఆర్ ఉన్న‌ట్టుండి కాడి ఎందుకు ప‌డేస్తారు అనే ప్ర‌శ్న అంద‌రి మ‌దిని తొలిచేస్తుంది. ఈ లీకుల వెనుక ఏదో మ‌త‌ల‌బు ఉంది. ఎవ‌రో కొంద‌రి అటెన్ష‌న్ డైవ‌ర్ట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా అది సాగింది. ప్ర‌భుత్వం నుంచి నిర్దేశిత ల‌క్ష్యం మేర‌కే లీకులు వ‌స్తాయి. వాటి ప‌ర్య‌వ‌సనాలను గ‌మ‌నించిన పిమ్మ‌ట‌నే త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయి. ఇదీ అలాంటిదే.

సైన్స్ కాంగ్రెస్ ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి మ‌ణిపూర్ సెంట్ర‌ల్ వ‌ర్సిటీకి త‌ర‌లిపోయింది. ఇది ఉస్మానియా యూనివ‌ర్సిటీ చేత‌గాని త‌న‌మే కాదు.. ప్ర‌భుత్వ చేత‌గాని త‌నం కూడా. శ‌తాబ్ది ఉత్స‌వాలు జ‌రుపుకుంటున్న ఓయూ నుంచి ప్ర‌తిష్టాత్మ‌క స‌ద‌స్సు చేజారింది అంటే అందుకు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌. ల‌క్ష ఉద్యోగాల భ‌ర్తీ హామీని కేసీఆర్ ప్ర‌భుత్వం నిల‌బెట్టుకోలేక‌పోయింది. అందుకే కేసీఆర్ ఉస్మానియా గ‌డ‌ప తొక్కేందుకు ప్ర‌య‌త్నించ‌డం లేదు. అక్క‌డి విద్యార్థులు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగానే ఉన్నారు. సైన్స్ కాంగ్రెస్ త‌ర‌లిపోవ‌డం అంటే ప్ర‌భుత్వానికి మాయ‌ని మ‌చ్చే. దేశాన్ని, ఇక్క‌డి వ‌న‌రుల‌ను, స‌హ‌జ సంప‌ద‌ను, మాన‌వ వ‌న‌రుల‌ను న‌డి బ‌జారులో అమ్మానికి పెడ‌తామంటూ బేరాలాడే జీఈఎస్ స‌ద‌స్సుల‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హిస్తూ రేప‌టి త‌రం శాస్త్ర‌వేత్త‌ల‌ను అందించే సైన్స్ కాంగ్రెస్ విష‌యంలో చేతులెత్తేయం చిన్న‌మాటేమీ కాదు. దీని తాలుకు విమ‌ర్శలు ఎదుర్కోవ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా లేదు. అదే స‌మ‌యంలో ల‌క్ష ఉద్యోగాల‌ను ఇప్ప‌టికిప్పుడు భ‌ర్తీ చేయ‌నూ లేదు. అందుకే నిరుద్యోగుల్లో అటెన్ష‌న్ డైవ‌ర్ట్ చేయ‌డానికే జిల్లాల కుదింపు లీకు తెర‌మీదికి వ‌చ్చింది.

ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ అనేక వ‌ర్గాల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ఎన్నో వ‌రాలు కురిపిస్తున్నాడు. ప్ర‌తిప‌క్షంలో అనైక్య‌త ఆయ‌న‌కు అనుచిత వ‌రం. అయినా నిరుద్యోగుల్లో వేళ్లునుకుపోయిన అస‌హ‌నం ఆయ‌న‌లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఉస్మానియా మ‌రో నిప్పు క‌ణిక అయితే దాని తాలూకు సెగ ప్ర‌భుత్వాన్ని కుదిపేస్తుంది. అంత‌కుమించి హాహాకారాలు కూడా పెట్టిస్తుంది. ఈ విష‌యాలు కేసీఆర్‌కు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలియ‌వు. అందుకే త‌న వారిని పురమాయించాడు. కొత్త జిల్లాల ర‌ద్దు అంటూ చిన్న లీకు బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేశాడు. 48 గంట‌లు గ‌డిచింది. అయినా దానిపైనే చ‌ర్చ‌. స్వ‌యంగా రెవెన్యూ మంత్రి ఖండించినా దానికి అంత‌గా ప్రాధాన్యం లేదు. అంటే ప్ర‌భుత్వం ఒక విష‌యాన్ని బ‌లంగా జ‌నంలోకి తీసుకెళ్లాల‌ని అనుకుంటే దాన్ని ఎవ‌రూ ఆప‌లేరు. జిల్లాల కుదింపు ప్ర‌చారమూ ఆ కోవ‌లోకే వ‌స్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here