త‌లైవా టార్గెట్ త‌మిళ పీఠ‌మే!

0
25

టైమింగ్ చూసుకొని పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన సూప‌ర్‌స్టార్‌
అశేష అభిమానులే త‌ర‌గ‌ని క్యాడ‌ర్‌

రెండు ద‌శాబ్దాల‌కు పైగా ఎదురు చూస్తోన్న అభిమానుల క‌ల ఫ‌లించింది. వాళ్ల ఆరాధ్య దైవం రాజకీయ రంగ‌ప్ర‌వేశానికి సై అన్నాడు. త‌మిళ‌నాడు రాజ‌కీయ చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గిన రోజుగా 2017 డిసెంబ‌ర్ 31 నిలిచిపోతుంది. ద‌క్షిణాది సూప‌ర్ స్టార్‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న త‌లైవా ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఖాయ‌మైంది. తానే స్వ‌యంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. అశేష అభిమాన స్ర‌వంతి స‌మ‌క్షంలో రాజ‌కీయ అరంగేట్రంపై స్ప‌ష్ట‌త ఇచ్చాడు. జ‌య‌ల‌లిత త‌ర్వాత మ‌రో త‌మిళేత‌రుడు అక్కడి రాజ‌కీయాల‌ను శాసించ‌బోతున్నాడు. ఎంజీ రామ‌చంద్ర‌న్‌, ఎన్టీ రామారావు త‌ర్వాత అంత‌టి క్రేజ్‌ను సొంతం చేసుకున్న వెండితెర ఇల‌వేల్పు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయ గోదాలో అడుగుపెడుతున్నాడు. తెలుగు మెగాస్టార్ చిరంజీవిలా కాకుండా క‌రెక్ట్ టైమింగ్ చూసుకొని పార్టీ పెట్ట‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు ర‌జ‌నీకాంత్‌. ఈ టైమింగ్ ఆయ‌న‌కు రాజ‌యోగం తెచ్చిపెట్టి తీరుతుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

మ‌రాఠీ నేప‌థ్య‌మున్న కుటుంబం నుంచి వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ పుట్టింది కర్ణాట‌క‌లో. ర‌జ‌నీ అస‌లు పేరు శివాజీరావు గైక్వాడ్‌. పెరిగింది, చ‌దువుకున్న‌దీ అంతా క‌ర్ణాట‌క‌లోనే. క‌ర్ణాట‌క రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌లో కండ‌క్ట‌ర్‌గా ఉద్యోగం చేస్తున్న క్ర‌మంలోనే ర‌జ‌నీ ఎంద‌రి అభిమానాన్నో సొంతం చేసుకున్నాడు. ఆయ‌న టికెట్ ఇచ్చే తీరు, ప్ర‌యాణికుల నుంచి డ‌బ్బులు తీసుకోవడం, చిల్ల‌ర తిరిగి ఇచ్చేయ‌డం అంతా క‌ళాత్మ‌కంగా జ‌రిగేవి. అందుకే ప్ర‌యాణికులు ఆయ‌న డ్యూటీ చేసే బ‌స్సు కోసం ఎదురు చూసేవారు. సాధార‌ణ కండ‌క్ట‌ర్‌గా వంద‌లాది మంది అభిమానాన్ని చూర‌గొన్న ర‌జ‌నీ త‌న ల‌క్ష్యాన్ని వెదుక్కుంటూ చెన్న‌ప‌ట్నం చేరాడు. శిల ఎవ‌రి చేతిలో ప‌డితే శిల్పంగా మారుతుందో అలాంటి బాల‌చంద‌ర్ క్యాంపులో చోటు ద‌క్కించుకున్నాడు ర‌జ‌నీ. అయితే ఇది అంత సులువుగా ద‌క్కిన అవ‌కాశం కాదు. ఒక్క చాన్స్ దొరికింది చాలు ఇక వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వెండితెర వేల్పుగా త‌న‌ను తాను తీర్చిదిద్దుకున్నాడు. కోట్లాది మంది అభిమానాన్ని చూర‌గొన్నాడు. సూప‌ర్ స్టార్‌గా ఎదిగినా సామాన్యుడిలా ఉండ‌టం ర‌జ‌నీకే సాధ్యం. స్టార్‌డ‌మ్‌ను ప‌క్క‌న‌బెట్టి జ‌నాల్లో క‌లిసిపోయేవారు. సినిమాలు విజ‌యం సాధించిన‌పుడు కోట్లాది రూపాయ‌లు పోగేసుకోవ‌డ‌మే కాదు ఫ్లాప్ అయ్యి నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు న‌ష్టాల్లో కూరుకుపోయిన‌పుడు రెమ్యూన‌రేష‌న్ సైతం తిరిగి ఇచ్చిన ఉదార‌స్వ‌భావుడు. సంపాదించిన దాట్లో ఎంతో కొంత సేవ‌ల‌కు ఖ‌ర్చు చేసిన వాడు. మొత్తానికి మన‌స్సున్న మంచోడు.

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై 1995 నుంచి ఊహాగానాలు సాగుతున్నాయి. అప్ప‌టి ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావు స్వ‌యంగా మ‌ద్రాస్ వెళ్లి ర‌జ‌నీకాంత్‌ను రాజ‌కీయాల్లోకి రావాలంటూ ఆహ్వానించారు. ఆ అభ్య‌ర్థ‌న‌ను సున్నితంగా తిర‌స్క‌రించారు ర‌జ‌నీ. అప్ప‌టి నుంచి ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా ర‌జ‌నీ రాజ‌కీయ ప్ర‌వేశంపై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యేవి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి 2009లోనూ ర‌జ‌నీ పార్టీపై ఊహాగానాలు సాగాయి. కానీ త‌లైవా మాత్రం స్పందించ‌లేదు. 2015 చివ‌ర‌లో జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌ప్పుడు కూడా ర‌జ‌నీ పార్టీ పెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అప్పుడూ ర‌జ‌నీ గుంభ‌నంగా ఉండిపోయారు. ద్ర‌విడ అస్తిత్వ నేల త‌మిళ‌నాట రాజ‌కీయ పార్టీ పెట్ట‌డం అంటే పెరియర్ అడుగు జాడ‌ల్లో త‌మిళుల అస్తిత్వాన్ని ప్ర‌తిబింబించాలి. బెంగ‌ళూర్ నుంచి మ‌ద్రాస్‌కు మారిన కొద్ది రోజుల్లోనే ర‌జ‌నీ పూర్తి త‌మిళుడుగా మారిపోయాడు. వారి అస్తిత్వానికి ప్ర‌తీక‌గా నిలిచాడు. స్టార్‌గా ఎదుగుతున్నా కొద్ది ఒదుగుతూ వచ్చాడు.

2016లో వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం విజ‌యం సాధించి త‌మిళ పాల‌నా ప‌గ్గాలు స్వీక‌రించిన జ‌య‌ల‌లిత కొన్ని నెల‌ల్లోనే తీవ్ర అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరారు. సుదీర్ఘ చికిత్స అనంత‌రం ఆమె తుదిశ్వాస విడిచారు. త‌మిళులు త‌మ అమ్మ‌ను కోల్పోయిన‌ట్టుగా దుఃఖించారు. జ‌య వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకోవ‌డానికి శ‌శిక‌ళ‌, ఆమె వ్య‌తిరేకులు చేసిన ప్ర‌య‌త్నాలు ఆ పార్టీని బ‌ల‌హీన ప‌రిచాయి. శ‌శిక‌ళ ఎదుర్కోవ‌డానికి ఢిల్లీ పాల‌కుల ఎదుట మోక‌రిల్లాడు ప‌న్నీర్‌సెల్వం. అయినా కుర్చీ చేజారింది. సీఎం అవ్వాల‌ని క‌ల‌లుగ‌న్న శ‌శిక‌ళ జైలు పాల‌య్యింది. ఆమె ప్ర‌తినిధిగా గ‌ద్దెపైకి ఎక్కిన ప‌ళ‌నిస్వామి ప‌న్నీర్ బాట‌లోనే ఢిల్లీకి జీ హుజూర్ అన్నాడు. ప‌న్నీర్‌, ప‌ళ‌ని ఏక‌మ‌య్యారు. శ‌శిక‌ళ కుటుంబాన్ని రాజ‌కీయ చిత్ర‌ప‌టం నుంచి చెరిపేయాల‌ని ప్ర‌య‌త్నించారు. ఇదే స‌మ‌యంలో క‌రుణానిధి కుటుంబం, డీఎంకే పార్టీ బీజేపీకి, సంఘ్ ప‌రివార్‌కు ద‌గ్గ‌ర‌య్యింది. జ‌య లేని అన్నాడీఎంకేకు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావించిన మోడీ క‌రుణ‌తో స్నేహ‌హ‌స్తాన్ని చాచాడు. ఫ‌లితంగా ఆయ‌న త‌న‌య క‌నిమొళి ఎదుర్కొంటున్న 2జీ స్పెక్ట్రం కేసును నీరుగార్చాడు. ఆ కేసు నుంచి మాఫ్ ద‌క్కినందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో డీఎంకే ఎన్‌డీఏలో చేర‌డం ఖాయ‌మ‌య్యింది.

ప‌ళ‌ని, ప‌న్నీర్‌, క‌రుణ ఇప్పుడు బీజేపీకి కావాల్సిన వారు. ఇందుకోసం త‌మిళుల అస్తిత్వాన్ని వారు ప‌ణంగా పెట్టార‌నేది త‌మిళుల భావన. ఈ నేప‌థ్యంలోనే ఆర్‌కే న‌గ‌ర్‌లో ఆ రెండు పార్టీల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు ఓట‌ర్లు. డీఎంకేకు క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్క‌లేదు. అంటే మోడీతో డీఎంకే, అన్నాడీఎంకే స్నేహాన్ని అప‌విత్ర క‌ళ‌యిక‌గా అక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో త‌మిళ నాట రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయాల‌ని భావిస్తోన్న ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్‌హాస‌న్ సైతం మోడీతో స‌ఖ్య‌త పాటిస్తూ వ‌స్తున్నారు. దీనిని త‌మిళులు ఎలా రిసీవ్ చేసుకుంటార‌న్న‌ది మ‌రి కొన్ని రోజుల్లో తేట‌తెల్లం అవుతుంది. అయితే రాజ‌కీయాల్లోకి రావ‌డంపై ఊగిస‌లాట‌లో ఉన్న ర‌జ‌నీకాంత్‌కు స్ప‌ష్ట‌త ఇచ్చింది మాత్రం ఆర్‌కే న‌గ‌ర్ ఓట‌ర్లే. అక్క‌డ దిన‌క‌ర‌న్‌ను గెలిపించ‌డం ద్వారా ద్ర‌విడ అస్తిత్వాన్ని వారు చాటారు. అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న తెలుగు ప్ర‌జ‌ల ఓట్ల‌తోనే దిన‌క‌ర‌న్ గ‌ట్టెక్కార‌ని కొంద‌రు వాదిస్తున్నారు. దిన‌క‌ర‌న్‌కు పోలైన మొత్తం ఓట్లను లెక్కిస్తే ఆ వాద‌న త‌ప్ప‌ని తేలిపోతుంది. జ‌య‌కు అస‌లైన వార‌సులు శ‌శిక‌ళ కుటుంబ స‌భ్యులేన‌ని ఆర్కే న‌గ‌ర్ ఓట‌ర్లు తేల్చేశారు. అంతేకాదు ఢిల్లీ ఎదుట మోక‌రిల్లిన వారు త‌మ దృష్టిలో ఎంత‌టి మ‌రుగుజ్జులో కూడా స్ప‌ష్టం చేశారు. ఈ ఫ‌లిత‌మే త‌మిళ‌నాట ఏర్ప‌డిన రాజ‌కీయ శూన్య‌త‌ను చాటి చెప్పింది. ఇప్పుడు అదే శూన్య‌త‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డానికి త‌లైవ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశారు.

డీఎంకే, బీజేపీ పొత్తు ఖ‌రారైన ప‌క్షంలో ఎన్‌డీఏ త‌ర‌పున ప్ర‌ధాని మోడీ, స్టాలిన్ ప్ర‌చారంలోకి దిగుతారు. జ‌య మ‌ర‌ణంతో అన్నాడీఎంకేకు స్టార్ క్యాంపేయిన‌ర్ లేకుండా పోయారు. అక్క‌డ‌ నెల‌కొన్న గ్రూపు త‌గాదాల‌తో ఇప్పుడ‌టువైపు వెళ్లే సాహ‌సం కూడా ఎవ‌రూ చేయ‌క‌పోవచ్చు. దిన‌క‌ర‌న్ గెలుపు త‌ర్వాత ప‌ళ‌ని స‌ర్కార్ ఎంత‌కాలం మనుగ‌డ‌లో ఉంటుంద‌న్న‌దీ ప్ర‌శ్నార్థ‌క‌మే. అన్నాడీఎంకేలోని నేత‌లు ఈపీఎస్‌-ఓపీఎస్‌ల‌తోనో, దిన‌క‌ర‌న్‌తోనో చేరిపోవ‌చ్చు. వీళ్లెవ‌రూ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను భుజాల‌కెత్తుకునేంత స‌మ‌ర్థులు కారు. అంటే అన్నాడీఎంకే పార్టీ స్థానే ఏర్ప‌డిన గ్యాప్‌ను ర‌జ‌నీ త‌న‌కు అనుకూలంగా మ‌లచుకోవ‌చ్చు. స్వ‌త‌హాగా సూప‌ర్‌స్టార్‌. కెరీర్ మొత్తం క్లీన్ ఇమేజ్‌. చెన్నై నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు కోట్లాది మంది అభిమానుల అండ‌. వారు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీకి సానుభూతిప‌రులుగా ఉన్నా వాటిని వీడి ర‌జ‌నీ వెంట వ‌చ్చేయ‌డం ఖాయం. దీనికి తోడు చిరంజీవిని త‌ప్పుదోవ ప‌ట్టించినట్టుగా.. అంగ‌ట్లో స‌రుకులుగా టికెట్ల‌ను అమ్ముకునే వారెవ‌రూ ర‌జ‌నీ వెంట లేరు. ఉన్నా వారిని ర‌జనీ ఉపేక్షించ‌రు. స్టార్ ఇమేజ్‌, క్లీన్ కెరియ‌ర్ ర‌జ‌నీని పెద్ద మాస్ లీడ‌ర్‌గా మారుస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. స‌హ‌జంగానే ర‌జ‌నీ రోడ్డుపై నిల‌బ‌డితే వేల‌ల్లో జ‌నం ఎగ‌బ‌డ‌తారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తాన‌ని చెప్ప‌డ‌మే కాదు.. ద్ర‌విడ అస్తిత్వాన్ని నిల‌బెడ‌తాన‌ని చెప్తే చాలు ర‌జ‌నీ త‌మిళ పీఠాన్ని ద‌క్కించుకోవ‌డం ఖాయం.

జ‌య మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకే, డీఎంకే చేసిన త‌ప్పిదాల‌కు దూరంగా నిర్దిష్ట‌మైన ల‌క్ష్యంతో అడుగులు వేయ‌డానికే ర‌జ‌నీ ప్ర‌ణాళిక‌లు ర‌చించుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈక్ర‌మంలో ఒక్క త‌ప్ప‌ట‌డుగు ప‌డినా ర‌జ‌నీ రాజ‌కీయ జీవితం పాతాళంలోకి జారిపోవ‌డం ఖాయం. ఆ పార్టీ ప్ర‌జారాజ్యంలా మునిగిపోవ‌డమూ ఖాయ‌మే. చిరంజీవికి, ర‌జ‌నీకాంత్‌కూ మ‌ధ్య పెద్ద‌గా సారూప్య‌త‌లు లేవు. ఇద్ద‌రూ సూప‌ర్ స్టార్లే కావ‌చ్చు.. ఎవ‌రి పంథా వారిదే. చిరంజీవి ఇమేజి చ‌ట్రంలో ఇరుక్కుపోగా ర‌జ‌నీ దానిని ఎప్పుడూ ప‌ట్టించుకోలేదు. ఎంత‌సేపు సాధార‌ణ పౌరుడిగా ఉండానికి ఇష్ట‌ప‌డ్డాడు. చిరంజీవి పార్టీ పెట్టిన స‌మ‌యంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీల‌కు తోడు.. అస్తిత్వ ఉద్య‌మ పాతాక టీఆర్ఎస్ ప్ర‌భావం మెండుగా ఉండేవి. చిరంజీవి అంతా తానే అనే భావ‌న‌తో ముందుకుపోయి త‌ల‌బొప్పి క‌ట్టించుకున్నాడు. ర‌జ‌నీ స్వ‌త‌హాగా నేను అనే భావ‌న‌కు దూరంగా జీవించే వ్య‌క్తి. ఇప్పుడు త‌మిళ రాజ‌కీయాల్లో భారీ శూన్య‌తే ఉంది. అది ర‌జ‌నీకాంత్‌కు ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంది. జ‌య‌ల‌లిత త‌ర్వాత రెండో త‌మిళేత‌ర వ్య‌క్తిగా ర‌జ‌నీ ఆ రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసిస్తారు అనడంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here